Thursday, November 4, 2010

బాబు డెరైక్షన్... తమ్ముళ్ల యాక్షన్


సంగారెడ్డి, న్యూస్‌లైన్ ప్రతినిధి : ‘కాంగ్రెస్ టీఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగులో భాగంగానే రహస్య ఎజెండాతో కావాలనే ఉద్దేశ పూర్వకంగా టీఆర్‌ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీని, ప్రత్యేకించి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు’... ‘తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని అందరికీ తెలుసు.

అయినా టీఆర్‌ఎస్ కానీ, జేఏసీ కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించరు. గాంధీభవన్ వద్ద నిరసనలు చేపట్టరు. టెన్ జనపథ్ ముట్టడికి రారు’... ‘జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలం గురించి ఏఐసీసీ సదస్సులో ప్రస్తావించిన నేతలు, తెలంగాణలో అమాయక విద్యార్థుల బలవన్మరణాల మీద ప్రస్తావించాల్సిన బాధ్యత లేదా?’... ఇదీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి అందిన ‘ప్రెస్‌మీట్’ స్క్రిప్టు సారాంశం.

జిల్లా పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహించి, టీఆర్‌ఎస్ పోకడలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటూ నాలుగు పేజీల నోట్‌ను ఫ్యాక్స్ చేశారు. ‘ప్రెస్‌మీట్’ వార్తలతో కూడిన క్లిప్పింగులను మరుసటి రోజు రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సిందిగా మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు. టీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి చంద్రబాబుకు ఎదురవుతున్న నిరసనను ఎదుర్కొనేందుకు ప్రెస్‌మీట్లు నిర్వహించి ఖ ండించాల్సిందిగా పార్టీ శ్రేణులను గతంలోనే ఆదేశించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయడం ద్వారా, పార్టీ ఉనికిని చాటాల్సిందిగా సూచించారు. అయితే స్థానిక నేతలెవరూ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్న దాఖలా కనిపించలేదు.

దీంతో ఏకంగా రాష్ట్ర కార్యాలయం నుంచే ఏయే అంశాలు మాట్లాడాలో పేర్కొంటూ, స్థానిక నేతలు ‘గమనిక’ అంటూ ఓ నోట్‌ను పంపించారు. ‘తెలంగాణ అంశంపై పార్టీ వైఖరి స్పష్టం చేయకుండా ఎన్ని చెప్పినా, ఎవరూ వినే పరిస్థితిలో లేరు. మేం ఏం మాట్లాడాలో ముందే రాసిచ్చిన తర్వాత ఇక కొత్తగా చెప్పేదేముంది. అందుకే రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన నోట్ కిందే సంతకాలు చేసి మీడియాకు ఇస్తున్నాం.’ అంటూ ‘ప్రెస్‌నోట్’ వెనుక గుట్టు విప్పాడో ‘దేశం’ ఔత్సాహిక నేత.

1 comment: