ప్రధాని అయ్యే యోగ్యత నాకు లేదు
అప్పటి రాజకీయం సిద్ధాంతపరం..
ఇప్పడంతా రాద్ధాంతం
ప్రజా చైతన్యమే శ్రీరామరక్ష
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెంకయ్య
ప్రజా చైతన్యమే శ్రీరామరక్ష
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెంకయ్య
నేను మాట్లాడినా వేగమే. రాసినా వేగమే. తిన్నా వేగమే. ఏదీ చేసినా వేగమే. నాకు ఇప్పుడు తెలుస్తోంది. డాక్టర్లు కూడా చెప్పారు... మీరు 60 ఏళ్లకే 80 ఏళ్లులా తిరిగేశారు... శరీరం అలసిపోయి ఉంది... జాగ్రత్తలు తీసుకోండి అని.. నాకు కూడా అనిపిస్తోంది. ఈ దేశంలో నేను తిరగని జిల్లా లేదు. రాజకీయంలో రెస్టు సాధ్యం కాదు.. సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలంతే..
మీకు ఈ వాక్ ప్రవాహం ఎలా అబ్బింది?
ఏబీవీపీలో ఉన్నప్పుడు మా గురువు దుర్గాప్రసాద్ నన్ను బాగా ప్రోత్సహించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథ్‌రావు జోషి ఉపన్యాసం విన్నాను. ఆయనంత వేగంగా మాట్లాడే నాయకుడు దేశంలో ఎవరూ లేరు. ఆయన శైలి, బాణి చూసి మొదట్లో నేర్చుకున్నాను. అప్పటి నుంచి అలవాటైపోయింది.
సంధికాలంలో రాజకీయాల్లోకి వచ్చారు.. రెండు తరాల మధ్య తేడా ఏమిటి?
అప్పటి రాజకీయం సిద్ధాంతం... ఇప్పుడు రాద్ధాంతం... సిద్ధాంతపరమైన రాజకీయాలు తగ్గిపోయాయి. అధికార పక్షానికి సహనం అవసరం. విలువలు తరిగిపోయాయి.. ధనప్రవాహం పెరిగిపోయింది. రాజకీయం నిజానికి ఒక మిషన్... కానీ, ఇవాళ అది కమీషన్ అయిపోయింది. అర్థం లేని విమర్శలు చేయడం, అధికార పక్షం ఎదురు దాడి చేయడం, పత్రికల గొంతు నొక్కేయడం ఇప్పుడున్న పరిస్థితులు. మా మాటల్లో వ్యక్తిగత ద్వేషం ఉండేది కాదు. అందుకే అవతలి వ్యక్తులు కూడా దానిని పాజిటివ్‌గా తీసుకునేవారు.
వ్యక్తుల ప్రాధాన్యత పెరిగితే పార్టీల ప్రాబల్యం తగ్గే ప్రమాదముంది కదా?
వారసత్వాలు పెరిగిపోయాయి. నేను ఈ రోజు వరకూ ఎవరికీ పాదాభివందనం చేయలేదు. ఎంతో మహోన్నతంగా భావించే వాజపేయి, అద్వానీలకు కూడా నేను పాదాభివందనం చేయలేదు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. బీజేపీలో కొన్ని అపశ్రుతులు ఉన్నాయి. (ఆర్కే: ఇప్పుడు వ్యక్తులు ప్రధానమైపోతున్నారు.
కర్ణాటకలో గాలి జనార్దన్‌రెడ్డి లాంటి వారిని ఇంత పెద్ద పార్టీ అదుపు చేయలేకపోతోంది?) జాతీయ స్థాయిలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అయితే, మాది బెటర్ పార్టీ అని సంతృప్తి పడటం లేదు. వీటిని సరిదిద్దుకునేందుకు చర్చించుకుంటున్నాం. వారసత్వాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
కర్ణాటకలో మైనింగ్‌ను నిషేధించాం కదా... కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వివక్ష చూపిస్తోంది. నేటి పరిస్థితులన్నింటికీ ప్రజా చైతన్యమే శ్రీరామరక్ష... ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి. (ఆర్కే: అది తీసుకు రావాల్సిన వారే రాజీ పడిపోతే ఎలా సాధ్యం?) రాజీ పడకూడదు. అయితే, మాకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఇవ్వనప్పుడు కొన్ని చేయలేం. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మంచి అభ్యర్థులనే పెట్టాలి. అప్పటికీ ఇప్పటికీ ఖర్చులు బాగా పెరిగాయి. ఇప్పుడు అన్నింటికీ డబ్బులే..
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటారా?
తప్పకుండా వస్తుంది. అలాగే ప్రజల్లో కూడా మార్పు వచ్చి, భవిష్యత్తులో ఏకపార్టీ విధానం వైపు మొగ్గు చూపిస్తారు.
మీరు ప్రధాని కావాలనుకున్నారా?
జీవితంలో అలాంటి కోరికలు లేవు. నా శక్తి, సామర్థ్యం, యోగ్యత నాకు తెలుసు. ఎందుకంటే భారతదేశ ప్రధాన మంత్రి అంటే మామూలు విషయం కాదు. నా వరకు నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను. నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే.. మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి.
మీ మిత్రులు సమైక్యవాదాన్ని కోరుతుంటే.. మీరు తెలంగాణ అంటున్నారు కదా?
నేను పార్టీ పరంగా ప్రకటించాను. వ్యక్తిగతంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను... కలిసి కలహించుకోవడం కంటే విడిపోయి సహకరించుకోవడం మంచిది. వన్‌సైడ్ రొమాన్స్ సాధ్యం కాదు. తెలంగాణ భావం బాగా నాటుకుపోయింది.
No comments:
Post a Comment