Saturday, November 20, 2010

ఎక్సెల్' కుర్రాడు ఎక్సలెంటుగా సంపాదిస్తున్నాడు

'ఎక్సెల్' కుర్రాడు ఎక్సలెంటుగా సంపాదిస్తున్నాడు

ముందుగా మీ గురించి కొంచెం...
నా పూర్తిపేరు దుగ్గిరాల పూర్ణచంద్రరావు. ఇంటర్నెట్‌లో ఎక్కువమందికి చందూగానే పరిచయం. ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్స్ డిగ్రీ అయ్యాక నాలుగేళ్ల క్రితం ఇండోర్ ఐఐఎమ్ నుంచి పట్టభద్రుడినయ్యాను. క్యాంపస్ ఆఫర్‌తో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగంలో చేరాను. ఆర్నెల్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో బ్లాగింగ్‌కే అంకితమైపోయా.

బ్లాగింగ్ కోసం ఉద్యోగాన్ని వదిలేయడం ఏమిటి?
ఉద్యోగంలో చేరిన కొత్తలో కొన్ని విషయాల గురించి బాగా పరిశోధన, విశ్లేషణ చేసేవాణ్ని. వాటిని పొందుపరచడానికి ఎక్సెల్ ఎక్కువగా ఉపయోగపడేది. నేను చేస్తున్న పని, దాని ఫలితాల గురించి సరదాగా నా వ్యక్తిగత బ్లాగులో రాస్తుండేవాణ్ని. తోచిన విషయాలేవో రాయడానికే ఎక్కువమంది బ్లాగులు ఉపయోగిస్తుంటారు. మొదట్లో నేనూ అంతే. 2007లో అమెరికాలో పనిచేస్తున్నప్పుడు కొంత ఖాళీ సమయం చిక్కింది. అప్పుడు ఎక్సెల్‌లో నేను గమనించిన కొత్త అంశాల గురించి బ్లాగులో చర్చించేవాణ్ని. ఒకసారి నేను రాసిన వ్యాసాన్ని ఒక ప్రముఖ బ్లాగు ప్రస్తావించింది.

ఆరోజు నుంచి నా బ్లాగుకు సందర్శకుల తాకిడి పెరిగింది. దాంతో నేను రాసేది ఎక్కువమందికి ఉపయోగపడాలన్న ఆలోచన నాలో పెరిగింది. దానివల్ల ఎక్సెల్‌కు సంబంధించి కొన్ని ఉత్పత్తులు తయారుచేసి బ్లాగులో పెట్టాను. అవసరమైనవారు వాటిని కొనుక్కుని ఉపయోగించడం, వాటి మంచిచెడులను చర్చించడం, ఇతరులకు వాటి గురించి చెప్పడం వల్ల నాకు పని పెరిగింది. దాంతో పాటే ఆదాయం కూడా. అయితే వారానికి కనీసం మూడు వ్యాసాలు రాయాలంటే నేను ముందు చాలా చదవాలి, పరిశోధన చేయాలి. వీటికి తోడు నేను అమ్మిన ఉత్పత్తులకు సపోర్ట్‌నివ్వాలి. నా వ్యాసాలు చదివి ఎవరైనా సందేహాలు అడిగితే వాటిని నివృత్తి చేయాలి. వీటన్నిటికీ రోజుకు పది పన్నెండు గంటల సమయం అవసరం. అందువల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి మొన్న ఏప్రిల్లో విశాఖపట్నం వచ్చేశాను. ఇప్పుడు ఇంటినుంచే పూర్తి స్థాయిలో నా వెబ్‌సైట్ చందూ.ఆర్గ్ (chandoo.org)ను నడుపుతున్నా.

బ్లాగింగ్ ద్వారా ఆదాయం ఎలా పెరిగింది?
మొదటి రెండేళ్లలో గూగుల్ యాడ్‌సెన్స్ ప్రకటనల ద్వారా కొంత ఆదాయం వచ్చేది. సందర్శకుల సంఖ్య పెరుగుతుండటం గమనించి ఎక్సెల్ గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, సాఫ్ట్‌వేర్ వంటివాటిని అమ్మకానికి పెట్టాను. వాటిద్వారా నెలకు రెండుమూడొందల డాలర్ల ఆదాయం వచ్చేది. నెలకు సుమారు లక్షన్నరమంది వరకూ నా బ్లాగును చూసేవారు. అప్పుడు నెలకు నాలుగైదు వందల డాలర్లకు నా సంపాదన పెరిగింది.

తర్వాత ఎక్సెల్ టెంప్లేట్లు రూపొందించడం ద్వారా ఇంకా పెరిగింది. ఈ ఏడాది మొదట్లో నేను 'ఎక్సెల్ స్కూల్'ను ప్రారంభించాను. అది ఇరవై గంటల ట్యూషన్. దానిద్వారా ఇప్పటికి నాలుగు వందలయాభైమందిని ఎక్సెల్ నిపుణులుగా తీర్చిదిద్దాను. ఇలా నా ఆదాయం ఏడాదికి లక్ష డాలర్లకు చేరుకుంది. దానిక న్నా ముఖ్యం - 2009లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'మైక్రోసాఫ్ట్ వేల్యుబుల్ ప్రొఫెషనల్' ఎంవీపీ అవార్డును అందుకున్నాను.

బ్లాగర్లకు చందూ చెబుతున్న చిట్కాలు
బ్లాగు ద్వారా డబ్బో, పేరో సంపాదించాలన్న ఉద్దేశం ఉన్నా లేకున్నా, ముందు బ్లాగయితే ప్రారంభించండి.

- తెలిసిన విషయాన్ని చక్కటి భాషలో చెప్పడం, సరళంగా ఎదుటివారికి అర్థమయ్యేలా రాయడం ముఖ్యం.

- ప్రపంచంలో మీకు తెలిసిన అన్ని అంశాల మీదా రాయాలనుకోకండి. సినిమాలు, క్రీడలు, రాజకీయాలు వంటి వాటిలో మీకు ప్రత్యేకమైన ఆసక్తి, నైపుణ్యం ఉంటే తప్ప వాటి జోలికి పోకండి. వాటి గురించి సమాచారం అందించే వెబ్‌సైట్లు బోలెడున్నాయి. ఒకటో రెండో అంశాలకు మీరు ప్రాధాన్యతనిస్తే మీకు నైపుణ్యం వస్తుంది. చదువరులకు మీ దగ్గర నాణ్యమైన సమాచారం లభిస్తుంది.

- మీరు రాసిందాన్ని పదిమందో, ఇరవైమందో చదువుతారు. వాళ్లకు పనికొచ్చేవి, సంబంధించినవి - ఏం రాయాలన్నది సీరియస్‌గా ఆలోచించినప్పుడే మీ రాతలకొక విలువ వస్తుంది.

- మీరు రాసిన విషయాలే రాసేవారు మరో కొంతమంది ఉంటారు. మొదట్లో వారు మనకు ప్రత్యర్థుల్లా అనిపిస్తారు. వారి గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు అనుకుంటాం. ఇది మానవస్వభావం. కానీ వారి కన్నా మెరుగ్గా ఏం రాయగలం అని ఆలోచించండి. వారి పనిని పరిశీలించండి. వారితో కలిసి నడవాలనుకోండిగానీ అధిగమించాలనుకోకండి.

- బ్లాగు ద్వారా రాత్రికి రాత్రే డబ్బు సంపాదించగలమనేది ఒట్టి భ్రమ. అదేమీ సినిమా కాదు, హిట్టోఫ్లాపో వెంటవెంటనే తెలిసిపోవడానికి.

- మీరు ఉద్యోగస్తులయితే, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే మీ బ్లాగు, అందులోని అంశాల గురించి క్లుప్తంగానయినా పై అధికారులకు తెలియజేయడమే మంచిది.

ఈ ప్రక్రియలో చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
మరీ ఎక్కువ లేవు. నేను చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. మొదటిసారి నేను ఎక్సెల్ గురించి చాలామంచి పుస్తకం తయారుచేసి కేవలం ఐదు డాలర్లకే అమ్మకానికి పెట్టాను. ఆ రేటు చూసి చదివేవాళ్లు దాని నాణ్యత గురించి సందేహించారు.

నా పొరపాటును తెలుసుకొని మరింత సమాచారాన్ని చేర్చి ధర పెంచాను. అప్పుడు అమ్మకాలు పెరిగాయి. అలాగే కొత్తలో నాకు నచ్చిన విషయాలన్నిటి మీదా రాసేసేవాణ్ని. టెక్నాలజీ, మార్కెటింగ్, బిజినెస్ - నాకు తెలిసినవన్నీ చెప్పేయాలనుకునేవాణ్ని. దానివల్ల రాతలో నాణ్యత దెబ్బతినింది. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకున్నాను.

నవ్య పాఠకులకు ప్రత్యేకంగా ఏమైనా చెబుతారా?
మామూలుగా ఇలాంటి ఇంటర్వ్యూలు పేపర్లో చదివినప్పుడు 'అదృష్టవంతుడు' అనుకుంటారు. రోజుకు కనీసం తొమ్మిది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా పని చేస్తేనే ఈ తరహా ఫలితాలు సాధ్యమయ్యాయని గ్రహించరు. ఎక్కువమంది 'ఏదో బ్రహ్మాండమైన ఆలోచన తట్టినప్పుడు చూద్దాం...' అనుకుంటారు. మీ దగ్గరున్న ఐడియా పాతదా, కొత్తదా, మంచిదా కాదా అన్నది అప్రస్తుతం. మీరు దాన్ని ఎంత మన స్ఫూర్తిగా ఆచరణలో పెడతారు అన్నదే ముఖ్యం. ఇతరులకు పనికొచ్చేదాన్ని అందిస్తే, లభించే ఫలితం అంతే గొప్పగా ఉంటుంది.

No comments:

Post a Comment